KTR: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది...! 5 d ago

TG : తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కానీ తెలంగాణ బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రస్తావన లేదన్నారు. పదేళ్లలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. దేశంలోనే తెలంగాణ టాప్ - 5లో ఉందని, కానీ ఈ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. తాము కేంద్రానికి ఇస్తుంది ఎక్కువ అని, కానీ తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇస్తుంది తక్కువ అని పేర్కొన్నారు. 2014లో కేంద్రంతో సఖ్యతతో ఉండి నిధుల సాధనకు ప్రయత్నం చేశామన్నారు.
విభజన సమస్యలను కేంద్రం ఇప్పటికీ పరిష్కరించలేదని, ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారు తప్ప కేంద్రాన్ని మాత్రం నిలదీయడం లేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారు కానీ తెలంగాణ పరిశ్రమలను మాత్రం మూసివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ గానీ, అదే విధంగా గల్ఫ్ కార్మికుల కోసం నిధులు గానీ, పసుపు బోర్డుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. తాము రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. కేంద్రంలో తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా, రాష్ట్ర సమస్యలపై వారు మాట్లాడరని, ఎన్నికల సమయంలో మాత్రమే వారు తెలంగాణకు వస్తారని విమర్శించారు.